కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కో అంశాన్ని, ఒక్కో సమస్యను తీసుకుని పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నది. లేదా దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేస్తున్నది. ఇందులో భాగంగా తాజాగా ధరణి సమస్యలను పరిష్కరించే ఉద్దేశ్యంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు భేటీ అయ్యారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని, విస్తృత సంప్రదింపులు,అఖిల పక్ష భేటీ తర్వాతే నూతన చట్టాన్ని తీసుకువస్తామని సీఎం చెప్పారు. సమస్యల అధ్యయనానికి పైలెట్ ప్రాజెక్టుగా ఓ మండలాన్ని ఎంపిక చేసుకోవాలని సూచించారు.
ధరణితో తలెత్తుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నానాటికీ భూ వివాదాలు, సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సమగ్ర చట్టం రూపొందించాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. ఒకప్పుడు గ్రామ స్థాయిలోనే రికార్డులు అందుబాటులో ఉండేవని, ఆ తర్వాత ఇవి మండల కేంద్రానికి, ఆ తర్వాత జిల్లా కేంద్రానికి, రాష్ట్ర స్థాయికి వెళ్లిపోయాయని తెలిపారు.
గతంలో భూ సమస్యల పరిష్కారానికి అప్పీలు చేసుకునే అవకాశం ఉండేదని గుర్తు చేశారని, ధరణితో గ్రామ, మండల స్థాయిలో ఏ సమస్యకు పరిష్కారం లేకుండా పోయిందని సీఎం వివరించారు. సమస్త అధికారాలు జిల్లా కలెక్టర్లకు అప్పజెప్పారని, అక్కడ కూడా సమస్య పరిష్కారం కావడం లేదని చెప్పారు. కలెక్టర్లు తీసుకునే నిర్ణయాన్ని ప్రశ్నించే ఆస్కారం లేకుండా ధరణిని రూపొందించారని తెలిపారు.
అందుకే భూ సమస్యల పరిష్కారానికి విస్తృతస్థాయి సంప్రదింపుు చేపట్టాలని, ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని సీఎం సూచించారు. అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాతో సమగ్ర చట్టాన్ని తీసుకురావాల్సి ఉన్నదని వివరించారు.
భూదాన్, పోరంబోకు, బంచరాయి, ఇనాం, కాందిశీకుల భూముల సమస్యలున్న ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకుని అక్కడ ఎదురవుతున్న సమస్యలపై అధ్యయనం చేయాలని, వాటిపై ఒక సమగ్ర రిపోర్టు రూపొందిస్తే సమస్యలపై పూర్తి స్పష్టత వస్తుందని సీఎం వివరించారు. అవసరమైతే వీటన్నింటిపై శాసన సలో చర్చ చేసి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.