తేది:14-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash.
మెదక్:మెదక్ జిల్లా పెద్దశంకరంపేట ప్రాంతంలో శనివారం సాయంత్రం సుమారు 7.30 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై బైక్‌పై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో భార్యాభర్తలు, కుమారుడు, కుమార్తె సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.
మృతులు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగీ గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఆదివారం జరగనున్న 2 విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ విషాదకర ప్రమాదం జరిగింది.
ప్రమాద తీవ్రతకు బైక్ పూర్తిగా ధ్వంసమవ్వగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ సంఘటనతో మాగీ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఓటు వేయడానికి బయలుదేరిన ఒకే కుటుంబం దుర్మరణం పాలవ్వడం స్థానికులను కలచివేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.