ఆగస్టులోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు: సీఎం రేవంత్ రెడ్డి..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వీ కృష్ణ మోహన్, సీఎస్ శాంతి కుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన రెడ్డితోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

 

కొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఓటరు జాబితా పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగా రిపోర్ట్ ఇవ్వాలని బీసీ కమిషన్‌ను ఆదేశించారు. బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 

జనవరి 31వ తేదీతోనే గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీకాలం ముగిసింది. ఆగస్టు 1వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తవుతుంది. గ్రామ సర్పంచ్ పదవీకాలం పూర్తయినందున ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతున్నది. ఆరు నెలలు దాటితే కేంద్రం నుంచి గ్రామాలకు వచ్చే గ్రాంట్స్ ఆగిపోతాయి. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ఇందుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది.

 

ఇన్నాళ్లు రిజర్వేషన్లపై స్పష్టత కోసం స్థానిక సంస్థల ఎన్నికలు జాప్యం అవుతున్నాయని అందరూ అనుకున్నారు. కుల గణన నిర్వహించి రిజర్వేషన్లను ఖరారు చేసే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల డిమాండ్లు వస్తున్నాయి. గత రిజర్వేషన్ల పద్ధతిలో బీసీలు ఎక్కువగా నష్టపోతున్నారనే భావన ఉన్నది. ఒక వేళ గత పంచాయతీ ఎన్నికల్లో పాటించిన రిజర్వేషన్ల విధానాన్నే పాటిస్తే కుల సంఘాలు భగ్గుమనే అవకాశం లేకపోలేదు.

 

అయితే, వచ్చే నెల 1వ తేదీన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఒక వేళ అప్పుడు తీసుకున్నా.. నోటిఫికేషన్ రావడానికి, వచ్చాక పోలింగ్ జరగడానికి ఇంకా సమయం పడుతుంది. అలాగైతే.. ఆగస్టులో లేదా.. సెప్టెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. కుల గణన చేపట్టి రిజర్వేషన్లను నిర్ణయించాలంటే అందుకు మరో ఐదారు నెలల సమయం పడుతుందని తెలుస్తున్నది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *