ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు: అఖిలేష్ యాదవ్, కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ మీటింగ్

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మరియు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) హైదరాబాద్‌లో ఆసక్తికరమైన భేటీ అయ్యారు. శుక్రవారం నంది నగర్ నివాసంలో బీఆర్‌ఎస్ నేతలతో సమావేశమైన అఖిలేష్, శనివారం ఉదయం ఒక కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మధ్యాహ్న భోజనం కోసం కేటీఆర్‌తో కలిసి మాధాపూర్‌లోని రామేశ్వరం కేఫ్‌కు వెళ్లారు. దక్షిణ భారతీయ వంటకాలకు ప్రసిద్ధి చెందిన ఈ కేఫ్‌లో వారిద్దరూ ఇడ్లీ, దోసెలు తింటూ కనిపించారు.

ఈ భేటీలో కేటీఆర్, అఖిలేష్ యాదవ్ ఇద్దరూ కలిసి టేబుల్ వద్ద కూర్చుని లంచ్ చేస్తూ దేశ రాజకీయ పరిస్థితులు, తెలంగాణ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సన్నిహిత భేటీ రెండు ప్రాంతీయ పార్టీల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను మరోసారి హైలైట్ చేసింది. కేటీఆర్ టీమ్ విడుదల చేసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

కేటీఆర్ ఉదయం తాజ్ కృష్ణ హోటల్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజన్ ఇండియా సమ్మిట్‌లో కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం రాజకీయాలకు అతీతంగా టెక్నాలజీతో పాటు వస్తున్న సవాళ్లు, ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతున్న అంశాలపై చర్చించింది. అయితే లంచ్ మాత్రం తాజ్ కృష్ణాలో కాకుండా రామేశ్వరం కేఫ్‌ను ఎంచుకోవడం వెనుక, అఖిలేష్ యాదవ్‌కు దక్షిణాది వంటకాలంటే ఇష్టం ఉండటం, ఆయన బెంగళూరులో చదువుకోవడం వంటి అంశాలు కారణంగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *