సెంటిమెంట్లకు కేసీఆర్ ఫుల్ స్టాప్..?

తొలి తెలంగాణ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి కేసీఆర్ ఎక్కువగా సెంటిమెంట్ నే ఫాలో అవుతూ కనిపించారు. ఆయన లక్కీ నెంబర్ ఆరు కావడంతో ఏ పని తలపెట్టినా ఆరు అంకె కలిసొచ్చేలా కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చేవారు. ఆయన కారు నెంబర్ కూడా అన్నీ కలిపితే ఆరు అంకే వస్తుంది. జిల్లాల సంఖ్య పెంచినప్పుడు కూడా 10 ఉమ్మడి జిల్లాలను 33 జిల్లాలుగా ప్రకటించారు. మూడు ప్లస్ మూడు కలిపితే ఆరు. ఇదే సెంటిమెంట్ తో సారు కారు పదహారు అంటూ పార్లమెంట్ ఎన్నికలలోనూ సక్సెస్ సాధించారు. కొత్త సచివాలయం ఏర్పాటు సమయంలోనూ కీలక 6 ఫైళ్లపై సంతకాలు చేసిన కేసీఆర్ తన కార్యాలయాన్ని కూడా ఆరో ఫ్లోర్ లో ఏర్పాటు చేసుకున్నారు.

 

వాస్తు మార్చినా ఫలితం సున్నా

 

అసెంబ్లీ ఫలితాల చేదు అనుభవంతో తన పార్టీ కార్యాలయం వాస్తును కూడా మార్చేశారు. ఇక కేసీఆర్ కోయినాపల్లి సెంటిమెంట్ అందరికీ తెలిసిందే. ప్రతి ఎన్నికలకు ముందు కేసీఆర్ సిద్ధిపేటలో కొలువైన కోయినాపల్లికి వెళ్లి అక్కడ వెంకటేశ్వరునికి పూజ చేయించి తన నామినేషన్ దాఖలు చేసేవారు. ఇప్పటికీ అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. ఏ కార్యక్రమానికి వెళదామనుకున్నా చేతి భుజానికి దట్టీ కట్టించుకుని వెళ్లడం కూడా ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికల ప్రచారమైనా, కార్యకర్తల సమావేశమైనా ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ చేతి భుజానికిక దట్టీ కట్టించుకుని వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.

 

ఏదీ కలిసిరావడం లేదు

 

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఘోర ఓటమిని చవిచూసిన కేసీఆర్ కు ఈ మధ్య ఏ ఒక్కటీ కలిసిరావడం లేదు. పార్లమెంట్ ఎన్నికలలోనూ ఒక్క సీటు సాధించుకోలేకపోయారు. పైగా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు క్యూకట్టి మరీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం, అటు కుమార్తె కవిత లిక్కర్ కేసులో తీహార్ జైలులో ఉండటం, తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను వెలికి తీస్తున్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టడం వీటన్నింటితో విసిగి వేసారిపోయిన కేసీఆర్ ఇకపై సెంటిమెంట్ ను పక్కన పెట్టేద్దామని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు తొలి సారి ప్రతిపక్ష నేత హోదాలో అడుగుపెట్టారు కేసీఆర్. అయితే చేతికి మాత్రం ఎప్పటిలాగానే దట్టీ లేదు.

 

దట్టీ సెంటిమెంట్

 

అంతకు ముందు కేసీఆర్ ఎక్కడికి వెళ్లాలన్నా మాజీ హోం మంత్రి మహమ్మద్ ఆలీని పిలిపించుకుని దట్టీ కట్టించుకునేవారు. అదే సెంటిమెంట్ ను కొన్ని సంవత్సరాలుగా పాటిస్తూ వచ్చారు. అయితే మొన్నటి అసెంబ్లీలో అడుగుపెట్టే వేళ కేసీఆర్ భుజానికి దట్టీ లేకపోవడంతో చర్చనీయాంశం అయింది. మహమ్మద్ ఆలీ సైతం కేసీఆర్ వద్దకు రాలేదని సమాచారం. ఒక వేళ ఆయన రాకున్నా ఫోన్ చేసి పిలిపించుకునేవారు కేసీఆర్. ఈ సారి అలాంటిదేమీ జరగలేదంటే సెంటిమెంట్ పక్కకు పెట్టినట్లేనా అని జనం చర్చించుకుంటున్నారు.

 

సెంటిమెంట్లకు ఫుల్ స్టాప్

 

సెంటిమెంట్ ప్రకారం పోతుంటే అన్నీ రివర్స్ అవుతున్నాయి ఈ మధ్య. పాత సచివాలయానికి సైతం వాస్తు ప్రకారం బాగుండకపోవడంతో పాత సచివాలయం వాస్తు మార్పులతో రెండో సారి అధికారంలోకి వచ్చారు కేసీఆర్. అయితే కొత్త సచివాలయం కట్టిస్తే చరిత్రలో మిగిలిపోతామని భావించారు. కానీ అది కాస్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉపయోగపడుతోంది. ఇలా వరుసగా తనకి అపశకునాలు కలగడంతో సెంటిమెంట్ పైనే విరక్తి పెంచుకున్నట్లు సమాచారం. ఈ సారి సెంటిమెంట్ పట్టించుకోకుండా ఏ పనైనా చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దట్టీ సెంటిమెంట్ తో పాటు మిగిలిన సెంటిమెంట్లకు కూడా ఫుల్ స్టాప్ పెట్టేలా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *