కోటి ఆశల తెలంగాణ ప్రజలకు.. కేంద్ర బడ్జెట్‌లో నిరాశ..

2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం బడ్జెట్‌ ప్రవేశ పెట్టింది. కోటి ఆశలతో కేంద్ర బడ్జెట్‌ కోసం ఎదురు చూసిన తెలంగాణ ప్రజలకు కేంద్రం నిరాశే మిగిల్చింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం ముంగిట రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు ఉంచింది. అయినప్పటికీ కేంద్రం మాత్రం తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదు.

 

అయితే ఏపీకి మాత్రం కేంద్రం కాస్త తీపి కబురు అందించింది. రాజదాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలను కేటాయించినట్టు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అంతే కాకుండా పోలవరం ప్రాజెక్టును త్వరతిగతిన పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, కోస్తా అంద్రాలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్టు ప్రత్యేకంగా ప్రకటించారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, విభజన హామీల అమలు కోసం, రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటి నుంచో కేంద్రాన్ని కోరుతూనే ఉన్నప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రావడం లేదు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనూ ఎలాంటి ప్రకటన రాకపోవడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు.

 

తాజాగా జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌తో సమానంగా ఎంపీ సీట్లను కట్టబెట్టారు. అయినప్పటికీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం మాత్రం బడ్జెట్‌ కేటాయింపుల విషయంలో తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించినట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, రీజనల్‌ రింగు రోడ్డు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా లాంటి అతి ముఖ్యమైన ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే, ITIల ఆధునీకరణకు ప్రత్యేక ఆర్థిక సాయం, నికర అప్పుపై సీలింగ్, ఆఫ్‌ బడ్జెట్‌ రుణాలపై పరిమితులు, మూసీ సుందరీకరణకు నిధులు, సెస్‌ తగ్గింపు, ITIR ప్రాజెక్టు పునరుద్ధరణ లాంటి కీలక అంశాలను కేంద్రం ముందుంచింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రతిపాదనలను కేంద్రం వినిపించుకున్నట్టు కనిపించడం లేదు.

 

రాష్ట్రంలో అమలు పర్చాల్సిన ఆరు గ్యారంటీలకు తోడు రైతు రుణమాఫీ లాంటి అదనపు భారాల నుంచి ఉపశమనం పొందాలంటే కేంద్రం నుంచి సాయం అవసరమని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా రుణ సమీకరణకు కేంద్రం చేయూత అవసరమవుతుందని, FRBM నిబంధనలకు లోబడి అప్పులను తీసుకునేందుకు గాను ఆఫ్‌ బడ్జెట్‌ రుణాల విషయంలో వెసులుబాటు ఇవ్వాలని రాష్ట్రం కోరినట్టు సమాచారం.

 

కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రెండు పద్దులపై రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టుకుంది. కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లు ఏ మేరకు వస్తాయోనని రాష్ట్ర ఆర్థిక శాఖ ఆసక్తిగా ఎదురు చూసింది. అయితే.. కేంద్రం మాత్రం రాష్ట్ర ఆశలపై నీళ్లు చల్లింది.

 

ప్రభుత్వ పాఠశాలల నిర్మాణంపై ఎలాంటి GST విధించకూడదని, ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌ను GST పరిధి నుంచి తప్పించాలని GST కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కేంద్రానికి సూచించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద 10 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని సీఎం రేవంత్‌ రెడ్డి కేంద్రాన్ని కోరారు. అయితే, ఇవేవీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.

 

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలకు నిధుల విషయంలో కేంద్రానికి రాష్ట్రం పలు దఫాలుగా నివేదించినట్టు చెబుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌ ప్రకటనపై గంపెడాశలతో ఉన్న తెలంగాణ ప్రజలకు నిరాశే మిగిలింది. వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్ల మంజూరు మరో ఐదేళ్లు పొడిగింపు.. సర్‌చార్జీల వాటా 10 శాతం మించకుండా పన్నుల ప్రతిపాదన, స్కిల్స్‌ యూనివర్సిటీకి సహకారంపై కూడా కేంద్రం నోరు మెదపలేదు. మూలధన వ్యయం కోసం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీలో తెలంగాణకు నిధుల పెంపు, సింగరేణి కాలరీస్‌కు కొత్త బ్లాక్‌ల కేటాయింపు, స్మార్ట్‌ సిటీ మిషన్లపై బడ్జెట్‌లో కేటాయింపులు ఆశించినప్పటికీ.. కేంద్రం నుంచి మొండి చెయ్యే ఎదురైంది. సర్వేలు పూర్తయి ఉన్న 30 రైల్వే లైన్లకు నిధులు, గృహజ్యోతి పథకాన్ని ముఫ్త్‌ బిజిలీ యోజనకు అనుసంధానం, కొత్త నవోదయ పాఠశాలలు, నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌ ఏర్పాటుపైనా ఎలాంటి కేటాయింపులు జగరలేదు.

 

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల విషయంలో అనుసరించిన ఆర్థిక వైఖరి కారణంగా తెలంగాణ ప్రభుత్వం గత పదేళ్లలో చాలా నష్టపోయింది. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకు పోయాయి. పన్నుల్లో వాటా తగ్గింపు కారణంగా 33 వేల 712 కోట్ల రూపాయల రెవెన్యూ నష్టం జరిగింది. నీతి ఆయోగ్‌ మిషన్‌ భగీరథ సిఫారసుల మేరకు రావాల్సిన 19 వేల 205 కోట్ల రూపాయలు.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇప్పించాల్సిన విద్యుత్‌ బకాయిలు 17 వేల 828 కోట్లు ఇంకా రాలేదని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.

 

2021–26 వరకు 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన గ్రాంట్ల నుంచి 5 వేల 374 కోట్ల రూపాయలు ఇంకా అలాగే ఉన్నాయి. వెనుకబడిన జిల్లాలకు నిధుల కింద 2 వేల 250 కోట్లు.. 14వ ఆర్థిక సంఘం సిఫారసులు 817 కోట్లు, 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన ప్రత్యేక నిధులు 723 కోట్లు.. ఏపీకి పొరపాటుగా బదిలీ అయిన CCS పథకాల నిధులు 495 కోట్లు ఇప్పించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతోంది. అయితే ఈ విజ్ఞప్తులు, సూచనలపై కేంద్రం మౌన ముద్ర వీడటం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *