దేశంలో టీకాల కొరతపై నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్ లక్ష్యంగా శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది విమర్శలు గుప్పించారు. రోజువారీ ఇచ్చే టీకా డోసుల సంఖ్య ఎందుకు తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రాల వద్ద 1.35 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉన్నాయని వ్యాక్సిన్ల కొరత లేదని చెబుతున్న కేంద్ర మంత్రి మరి రోజువారీ ప్రజలకు అందించే వ్యాక్సిన్ డోసుల సంఖ్య ఎందుకు తగ్గిందో తెలపాలని ఆమె నిలదీశారు.
ఇక ట్విటర్ పారదర్శక నివేదికపైనా ఆమె మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సమాచారాన్ని కోరే అభ్యర్ధనల్లో 25 శాతం భారత్ నుంచే ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేసిందని పేర్కొన్నారు. గత ఏడాది జులై-డిసెంబర్ మధ్య ఈ అభ్యర్ధనలు 258 శాతం ఎగబాకాయని చెప్పారు. అధికార బలంతో అసమ్మతిని అణిచివేసేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని ప్రియాంక చతుర్వేది దుయ్యబట్టారు.