TSLAWNEWS రిపోర్టర్ ఉపసర్పంచ్‌గా ఎన్నిక – మిన్పూర్ గ్రామ పంచాయతీకి నూతన నాయకత్వం

14-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash.

మెదక్ జిల్లా, పాపన్నపేట మండలం మిన్పూర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా, గ్రామ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. 1వ దశ ఎన్నికల్లో వార్డు నెంబర్‌–1 నుంచి పోటీ చేసిన అల్లారం సృజన యేసురత్నం సర్పంచ్‌గా ఘన విజయం సాధించి గ్రామ పంచాయతీ నూతన నాయకత్వ బాధ్యతలు స్వీకరించనున్నారు.
అలాగే వార్డు నెంబర్‌–8 నుంచి పోటీ చేసిన హనుమంతు కిరణ్, TSLAWNEWS పాపన్నపేట మండల రిపోర్టర్, ఉపసర్పంచ్‌గా ఎన్నికై ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన వ్యక్తిగా ఆయన ఎన్నిక గ్రామ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
గ్రామంలో త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, అంతర్గత రహదారుల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, పేదలు మరియు బలహీన వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని నూతన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లు స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా TSLAWNEWS మెదక్ జిల్లా ఇన్‌చార్జ్ గోల్లపల్లి సాయ గౌడ్ మరియు సలహాదారు నాగులోరి స్వామి దాస్ మిన్పూర్ గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ అల్లారం సృజన యేసురత్నం మరియు ఉపసర్పంచ్ హనుమంతు కిరణ్లను ఘనంగా సన్మానించారు. ప్రజాసేవకు అంకితభావంతో, మీడియా విలువలు మరియు ప్రజాప్రతినిధుల బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
నూతన నాయకత్వం బాధ్యతలు చేపట్టడంతో మిన్పూర్ గ్రామ అభివృద్ధి మరింత వేగంగా సాగుతుందన్న ఆశాభావాన్ని గ్రామస్తులు వ్యక్తం చేస్తూ, గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *