తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో సోమవారం చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. అసెంబ్లీ ముట్టడి, అధికారులపై దాడులు, స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ నేతల అనుచిత వ్యాఖ్యలు, ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన స్పీకర్ సభలోనే భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.
స్పీకర్ భావోద్వేగానికి గురైన దృశ్యాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీకి వచ్చిన సీఎం, డిప్యూటీ సీఎం నేరుగా స్పీకర్ ఛాంబర్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవికి గౌరవం కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని, స్పీకర్‌కు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు.
అసెంబ్లీ ప్రాంగణంలో విధుల్లో ఉన్న అధికారులపై దాడులు చేయడం, మహిళా అధికారుల సమక్షంలో అనుచితంగా ప్రవర్తించడం, స్పీకర్‌ను అభ్యంతరకర పదజాలంతో దూషించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని పాలకపక్షం మండిపడింది. అసెంబ్లీ చరిత్రలోనే ఈ ఘటనలు ‘బ్లాక్ డే’గా మిగిలిపోతాయని పలువురు ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులు ఎంతటి వారైనా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.