ఏపీ అభివృద్ధిపై చంద్రబాబు ఫోకస్.. ప్రతి నియోజకవర్గంలో ఆర్థిక ప్రగతే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర స్థూల అభివృద్ధిని నియోజకవర్గ స్థాయి ఆర్థిక ప్రగతితో అనుసంధానం చేయాలని సూచించారు. అమరావతిలో నిర్వహించిన టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో సుస్థిర అభివృద్ధి, నీటి వనరులు, పెట్టుబడులు, ఉపాధి, మౌలిక వసతులపై ఆయన కీలకంగా మాట్లాడారు.

ప్రతి ప్రాంతంలో అభివృద్ధి ఫలాలు స్పష్టంగా కనిపించేలా ప్రణాళికలు రూపొందించాలని పార్టీ నాయకులకు చంద్రబాబు సూచించారు. నియోజకవర్గాల గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్‌ (GDP)లో విజయవాడ సెంట్రల్, పాలకొల్లు, మండపేట, చిలకలూరిపేట, నెల్లూరు సిటీ, తణుకు నియోజకవర్గాలు ముందంజలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర స్థాయి ప్రగతితో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థలను కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రతి నియోజకవర్గంలో 15 నుంచి 20 రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు. పెట్టుబడులు ఆకర్షించడం, ఉపాధి అవకాశాలు పెంచడం, మౌలిక వసతులను మెరుగుపరచడం ద్వారా నియోజకవర్గాల ఆర్థిక స్థాయిని పెంచాలని చెప్పారు. సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగితే రాష్ట్రంతో పాటు ప్రతి నియోజకవర్గం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.