కాంగ్రెస్‌ నిరసనలో ఉద్రిక్తత.. పోలీసులతో కార్యకర్తల తోపులాట!

జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. స్పీకర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు నిరసనలో పాల్గొన్నాయి.

ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు దహనం చేశారు. దిష్టిబొమ్మ దహనం చేస్తున్న సమయంలో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్‌ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ తోపులాటలో ఓ కానిస్టేబుల్‌ కిందపడిపోయారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఘటన నేపథ్యంలో అంబేద్కర్‌ చౌరస్తా వద్ద పోలీసులు భద్రతను పెంచి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.