మొయినాబాద్‌లో మిడ్‌ నైట్ రేవ్ పార్టీ.. పోలీసులు అదుపులో యువతీయవకులు..!

బెంగుళూరు రేవ్ పార్టీలో చాలామంది యువతీయువకులు పట్టుబడ్డారు. అయినా యువకులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. దాని నుంచి తేరుకోకముందే మరొక పార్టీ ఒకటి హైదరాబాద్‌లో వెలుగుచూసింది. తాజాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో అర్థరాత్రి ముజ్రాపార్టీ వెలుగుచూసింది. ఇందులో పాల్గొన్న యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

 

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం సురంగల్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో సోమవారం అర్థరాత్రి ముజ్రా(అసభ్యకర) పార్టీ జరిగింది. దీనిపై సమాచారం పోలీసులకు అందింది. వెంటనే రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. ఈ పార్టీలో ఆరుగురు యువకులు, ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.

 

పట్టుబడినవారిని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం వారిని అక్కడ పోలీసుస్టేషన్‌లో విచారిస్తున్నారు. ఈ పార్టీలో పాల్గొన్న నలుగురు అమ్మాయిలు ఢిల్లీ నుంచి ఇక్కడకు తీసికొచ్చినట్టు తెలుస్తోంది. ఫామ్ హౌస్‌లో వీరంతా అసభ్యకర రీతిలో అర్థనగ్నంగా డ్యాన్స్‌ సన్నివేశాలను చూసి పోలీసులు షాకయ్యారు.

 

ఇంతకీ ఫామ్‌హౌస్ ఎవరిది? ఈ పార్టీ వెనుక ఎవరున్నారు? అనేదానిపై కూపీ లాగే పనిలో పడ్డారు పోలీసులు. దీని వెనుక బడా బాబుల పుత్రరత్నాలు వున్నట్లు అంతర్గత సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సివుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *