పులివెందులలో జగనన్న మెగా లే అవుట్..!

పులివెందులలో పేదల కోసం వేలాది ఇళ్లతో పెద్ద కాలనీ నిర్మిస్తున్నామని కలర్ ఇచ్చారు వైసీపీ నేతలు .. అయితే ఆ కాలనీలో స్థలాల కేటాయింపు దగ్గర నుంచి ఇళ్ల మంజూరు, గుత్తేదారుల ఎంపిక, బిల్లుల చెల్లింపు వరకు అన్నీ అక్రమాలే వెలుగుచూస్తున్నాయి. అక్కడ ఇల్లు కేటాయించిన లబ్దిదారుల్లో అంతా వైసీపీ వారే.. తన సొంత ఇలాకాలో పార్టీ వారికి అక్రమంగా అంత మేలు చేయాలని చూసిన జగన్.. మూడేళ్లలో ఒక్క ఇంటి నిర్మాణాన్ని కూడా పూర్తి చేయించలేకపోయారు. కాంట్రాక్టర్లకు మాత్రం వందల కోట్లు దోచిపెట్టారు. దానిపై ఎన్డీయే ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంట.

 

పులివెందులలో జగనన్న మెగా లే అవుట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో 8,400 ఇళ్లను మంజూరు చేసి అనర్హులను లబ్దిదారులుగా ఎంపిక చేశారని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి నకిలీ లబ్దిదారులపై చర్యలు తీసు కోవాలని కోరారు.

 

రాంగోపాల్‌రెడ్డి ఫిర్యాదుపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. లబ్దిదారుల జాబితాలో పేర్లున్నా వందలాది మందికి సంబంధించి ఆదారాలు వివరాలు లేకపోవడం పలు అనుమానాలకు తావి స్తోంది. ఇళ్ల నిర్మాణం పునాదులకే పరిమితం కాగా, సిమెంటు రహదారులతోపాటు భూగర్భ మురుగునీటి వ్యవస్థ, విద్యుత్తు సౌకర్యం కల్పించారు. ఈ పనులన్నీ తమ పార్టీ కాంట్రాక్టర్లకు దోచి పెట్టడానికే ముందస్తుగా చేపట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగనన్న కాలనీ పేరుతో కడప జిల్లాలోనే అతిపెద్ద కుంభకోణం జరిగిందంటున్నారు.

 

పులివెందుల పురపాలక పరిధిలోని ఏపీఐఐసీ. భూముల్లో 6,739 ఇళ్లు మంజూరు చేయగా, చాలా వరకు పునాదులు కూడా వేయలేదు. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. రాక్రీట్ సంస్థ అత్యధిక ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. సింహభాగం ఇళ్లు గోడల వరకే పరిమితం కాగా.. మూడోవంతు పునాదుల వరకే నిర్మాణాలు జరిగాయి. మూడేళ్ల కాలంలో ఒక్క ఇంటిని సైతం పూర్తి చేయకపోగా.. బిల్లులు మాత్రం వందల కోట్లలో చెల్లించారు. నిర్మాణాల పరిమాణం కంటే అధి కంగా గుత్తేదారులకు బిల్లులు చెల్లించినట్లు తెలుస్తోంది. టెండరు ప్రక్రియ, ఎలాంటి ఒప్పందం లేకుండా పనులు మొదలుపెట్టారు.

 

చరిత్రలో విధంగా గుత్తేదారు ఖాతాకు నేరుగా బిల్లులు చెల్లించే విధంగా ఉన్నత స్థాయిలో ఓ ప్రైవేటు బ్యాంకు ద్వారా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేసుకున్నారు. గతంలో పునాదులు వరకు నిర్మాణానికి 53 వేలు వరకు బిల్లులు చెల్లిస్తుండగా గుత్తేదారులకు లబ్ది కలిగేలా 70 వేలకు పెంచారు. దీంతో చాలా మంది పునాదుల వరకు నిర్మాణాలు చేపట్టి బిల్లులు తీసుకుని వెళ్లిపోయారు. కాంట్రాక్టర్లు దాదాపు 85 కోట్ల వరకు బిల్లులు చెల్లించగా. మౌలిక సదుపాయాల కింద చేప ట్టిన నిర్మాణాలకు మరో 100 కోట్లు వరకు వెచ్చించారు. దాదాపు 200 కోట్లు మేర వెచ్చించినా నిర్మా ణాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.

 

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెందిన రాక్రీట్ సంస్థ 4,937 ఇళ్ల నిర్మాణాన్ని తల పెట్టగా, ఇప్పటికి ఒక్క ఇల్లు కూడా పులివెందుల జగనన్న మెగా లేఅవుట్‌లో నిర్మాణం పూర్తి చేయలేదు. బిల్లులు మాత్రం నిర్మాణం కంటే అధిక మొత్తంలో పొందారు. మరి ఈ అవినీతి సామ్రాట్లపై సర్కారు ఎలా కొరడా ఝులిపిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *