ఏపీ టీడీపీ అధ్యక్షుడి పేరును ప్రకటించిన చంద్రబాబు..!

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి తాజాగా కీలక ప్రకటన చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడి పేరును ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఆయన తాజాగా ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు నియమించారు. ప్రస్తుతం ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడికి మంత్రిగా అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో బీసీ-యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లాకు ఈ పదవీ బాధ్యతలను అప్పగించారు. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గుడివాడ అమర్ నాథ్ పై భారీ మెజారిటీతో పల్లా శ్రీనివాసరావు విజయం సాధించారు. రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు.

 

‘విశాఖపట్నం పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేసిన పల్లా.. నూతన బాధ్యతలను కూడా విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షులుగా ఇప్పటి వరకు టీడీపీని నడిపించడంలో అద్భుత పనితీరును కబనబరిచిన సీనియర్ నేత, మంత్రి అచ్చెన్నాయుడికి అభినందనలు. ప్రతిపక్షంలో అనేక సమస్యలను ఎదుర్కొని పార్టీ బలోపేతానికి అచ్చెన్నాయుడు తీవ్ర కృషి చేశారు’ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

 

అయితే, ఏపీ పునర్విభజన తరువాత టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇప్పటివరకు రెండుసార్లు ఉత్తరాంధ్ర నేతలక దక్కింది. తాజాగా మూడోసారి కూడా ఉత్తరాంధ్ర నేతకే దక్కడం విశేషం. తొలుత కళా వెంకట్రావుకు అప్పగించారు. ఆ తరువాత అచ్చెన్నాయుడికి అవకాశమిచ్చారు. ఆయన ఆ పదవిలో గత ఐదేళ్ల నుంచి కొనసాగుతున్నారు. అయితే, అచ్చెన్నాయుడికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడంతో ఆయన స్థానంలో మరో బీసీ నేత పల్లా శ్రీనివాసరావును నియమించారు. గాజువాక నుంచి పోటీ చేసి గెలిచిన పల్లా.. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు.

 

ఇదిలా ఉంటే.. పల్లాను రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా నియమించే అవకాశమున్నదని పలు వార్తా కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. బీసీ నేతకే అవకాశం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నదని, ఈ క్రమంలో పలువురి పేర్లను పరిశీలిస్తున్నదని, అందులో ప్రముఖంగా పల్లా శ్రీనివాసరావు పేరు వినిపిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజా ప్రకటన వచ్చింది. పల్లాను నియమిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *