ప్రపంచలోని టాప్ టెన్ నగరాల్లో ఒకటిగా అమరావతి: మంత్రి నారాయణ

అన్నా క్యాంటీన్లను వీలైనంత త్వరలోనే పునరుద్ధరిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం, రెండో బ్లాక్‌లోని ఛాంబర్‌లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉన్నతాధికారులు, సిబ్బంది సహా పలువురు మంత్రికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి సమీక్ష అన్నా క్యాంటీన్లపైనే చేశానని తెలిపారు.

 

అన్నా క్యాంటీన్ల ఏర్పాటు కోసం మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. అంతే కాకుండా అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు భోజన సరఫరాపై పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. రాజధాని నిర్మాణంలో తొలి ఫేజ్ పనులకు రూ. 48 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. మూడు ఫేజుల్లో కలిపి రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అన్నారు. గతంలోనే టీడీపీ హయాంలో అమరావతి కోసం టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టినట్లు వెల్లడించారు.

 

ప్రపంచంలోని టాప్ టెన్ నగరాల్లో అమరావతి నిలిచేలా గతంలో పనులు చేశామని అన్నారు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా రాజధానిని నిర్మించేందుకు ప్రణాళికలు రచించామన్నారు. ఏ చిన్న లిటిగేషన్ లేకున్నా.. గత ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని అర్థాంతరంగా నిలిపి వేసిందని ఆరోపించారు. అంతే కాకుండా భూములు ఇచ్చిన రైతులను కూడా మోసం చేశారని విమర్శించారు. మూడు రాజధానుల పేరు చెప్పి జగన్ ప్రభుత్వం అమరావతిని ధ్వంసం చేశారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *