ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రమాణ స్వీకారం చేసిన ఐదు రోజులకే క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రాజధాని అమరావతి ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు.
సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు సీఎం చంద్రబాబు. ఉదయం పది గంటలకు సీఎం హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అవుతుంది. ప్రాజెక్టు ప్రాంతాన్ని తిరిగి నిర్మాణాలు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించనున్నారు. వాటి స్థితిగతుల గురించి తెలుసుకున్న తర్వాత ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ కంపెనీ, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. దీని తర్వాత ప్రాజెక్టుపై ఓ అంచనాకు రానున్నారు.
ఎక్కడెక్కడ సమస్యలున్నాయో వాటిపై దృష్టి పెట్టనున్నారు ముఖ్యమంత్రి. పెండింగ్‌లో పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో స్పిల్ వే పునాది పనులు తప్ప మిగతా పనులేమీ జరగలేదు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పనులను మెగా ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించింది.
ప్రధాన పనులు 2020 జనవరిలో మొదలై ఆగస్టు 2023 వరకు జరిగాయి. ఆ తర్వాత పనులు నత్తనడకగా సాగాయి. మరోవైపు సీఎ చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు అలర్టయ్యారు. హెలిపాడ్ దిగే ప్రాంతాన్ని రెడీ చేస్తున్నారు. పోలీసులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.