ఢిల్లీలో రైతన్నల కొత్త డిమాండ్లు..

రెండేళ్ల కిందట దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతంలో గొప్ప ఉద్యమాన్ని తలపెట్టిన రైతులు.. ప్రస్తుతం మరోసారి తమ డిమాండ్లతో రోడ్డెక్కారు. గతంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ గొంతు విప్పిన రైతన్నల ధాటికి కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాల విషయంలో వెనకడుగు వేసింది.

 

అయితే.. అనాదిగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు కోరుతున్న కొత్త డిమాండ్లతో ఢిల్లీ చేరుకున్నారు. ఈ మేరకు యునైటెడ్ కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా ఫిబ్రవరి 13న ‘దిల్లీ మార్చ్’కి పిలుపునివ్వటమే గాక ఫిబ్రవరి 16న ఒకరోజు గ్రామీణ భారత్ బంద్‌కు యునైటెడ్ కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది.

 

దీంతో కేంద్రం రైతు సంఘాలతో నేడు జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం ఇవ్వకపోవటంతో రైతులు తమ సంఘర్షణను తీవ్రతరం చేయనున్నారు. ఇది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోననే భయంతో కేంద్రం ఎక్కడికక్కడ రైతులు ఢిల్లీకి రాకుండా చర్యలు తీసుకోవటమే గాక.. ఇప్పటికే ఢిల్లీ శివారుకు చేరిన రైతులను అరెస్టు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇంతకూ ఢిల్లీలో ధర్నాలకు దిగిన రైతన్నలు కోరుతున్న డిమాండ్లేమిటో ఓసారి తెలుసుకుందాం.

 

ప్రధాన డిమాండ్లు..

అభివృద్ధి పేరుతో రైతులు భూములు సేకరిస్తే.. వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం.. ప్రస్తుతమున్న దానికంటే.. నాలుగు రెట్ల పరిహారం చెల్లించాలి.

వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేసి.. 200 రోజులకు పని దినాలను పెంచాలి, రోజువారీ కూలి రూ. 700 ఇవ్వాలి.

ఉత్తర ప్రదేశ్‌లోని లఖీంపూర్ ఘటనకు కారణమైన వ్యక్తులను శిక్షించాలి. అలాగే నాటి ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలి.

గతంలో ప్రముఖ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కమిటీ చేసిన సిఫారసు మేరకు అన్ని పంటలకు మద్దతు ధర కల్పిస్తూ చట్టం చేయాలి.

దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో రైతులు తీసుకున్న అన్ని పంటరుణాలను వెంటనే పూర్తిగా మాఫీ చేయాలి.

మిరప, పసుపు వంటి పలు రకాల సుగంధ పంటలకు సంబంధించి వెంటనే జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి.

రెండేళ్ల నాడు ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, నష్టపరిహారం ఇవ్వాలి.

WTOతో భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై నిషేధం విధించాలి.

విద్యుత్ పంపిణీని ప్రైవేటు సంస్థలక అప్పగించేలా అవకాశం కల్పిస్తున్న విద్యుత్ సవరణ బిల్లు 2020ను ఉపసంహరించుకోవాలి.

దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు, రైతు కూలీలకు నిర్ణీత పింఛనును కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి.

నకిలీ విత్తనాలు, పురుగు మందుల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

దేశ వ్యాప్తంగా ఉన్న ఆదివాసుల హక్కులను, అటవీ భూములను రక్షించేందుకు కేంద్రం పూనుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *