వచ్చే మార్చి నాటికి లక్ష ఉద్యోగాలు.. వారానికి ఒక నోటిఫికేషన్: వేం నరేందర్ రెడ్డి

మహబూబాబాద్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణ శిబిరంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు. అలాగే వారానికి ఒక ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

తమ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించిందని వేం నరేందర్ రెడ్డి అన్నారు. నిరుద్యోగులకు వరుసగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీని మూడు విడతల్లో చేపట్టనున్నట్లు తెలిపారు. వచ్చే డిసెంబర్‌లో మరోసారి పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు.

పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వేం నరేందర్ రెడ్డి సూచించారు. ఇదే సమయంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తమ పార్టీ, ప్రభుత్వ వర్గాలు కొంత వెనుకబడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు వివరించడంలో మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.