30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. దశాబ్దాలుగా కరువుతో అల్లాడుతున్న ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను సీఎం ప్రారంభించి, నీటిని విడుదల చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో మార్కాపురం ప్రాంతంతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగునీటి సమస్య నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది.

వెలిగొండ ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1996 మార్చి 5న శంకుస్థాపన చేశారు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత అదే ప్రాజెక్టు తొలి దశను ఆయన స్వయంగా ప్రారంభించనుండటం చారిత్రక ఘట్టంగా నిలవనుంది. ప్రాజెక్టు ద్వారా కరువు ప్రాంతాలకు నీరు అందడంతో వ్యవసాయ రంగంతో పాటు స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు కూడా ఊపందుకునే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘వెలిగొండ జలసిరులు–అభివృద్ధికి రెక్కలు’ పేరుతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటి అవసరాలకు ఊతం లభించడంతో కరువు ప్రాంతాల రూపురేఖలు మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం కావడంతో స్థానిక ప్రజల్లోనూ భారీగా ఉత్సాహం నెలకొంది.