భీకర జలప్రళయంతో అతలాకుతలమైన నేపాల్ ఇంకా కోలుకోలేదు. ఆరు రోజుల క్రితం సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వరదల ధాటికి నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లోని పలు హైడ్రో ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రాజెక్టుల సొరంగాల్లో 930 మందికి పైగా సిబ్బంది చిక్కుకుపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు నేపాల్ ఆర్మీ నిరంతరం సహాయక చర్యలు చేపడుతోంది. అయితే వరదల ఉద్ధృతి, దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, ప్రతికూల వాతావరణం కారణంగా రెస్క్యూ ఆపరేషన్లకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 903 మంది ప్రాణాలు కోల్పోగా.. 4,200 మందికిపైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారిలో దాదాపు 500 మంది విదేశీయులు ఉన్నట్లు సమాచారం. దీంతో తమ వారి ఆచూకీ కోసం బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. మృతుల సంఖ్య, గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో నేపాల్‌లో విషాదం మరింత తీవ్రంగా మారింది.