భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రకు నాంది పలికిన విక్రమ్-1 తొలి ప్రైవేటు రాకెట్ విజయవంతమైన ప్రయోగంలో చీరాల యువకుడు గారపాటి రాకేష్ భాగస్వామిగా ఉండటం గర్వకారణమని చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య అన్నారు. దేశ తొలి ప్రైవేటు రాకెట్ తయారీ బృందంలో పనిచేసి రాకేష్ తన ప్రతిభను చాటుకున్నారని కొనియాడారు. ఇది చీరాల పట్టణానికే కాకుండా బాపట్ల జిల్లాకు కూడా గర్వకారణమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శనివారం చీరాల కొత్తపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గారపాటి రాకేష్‌ను ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య ఘనంగా సన్మానించి అభినందించారు. అంతరిక్ష రంగంలో దేశం సాధిస్తున్న ప్రగతిలో యువత కీలక పాత్ర పోషిస్తోందని, రాకేష్ వంటి యువకులు తమ ప్రతిభతో దేశానికి పేరు తీసుకురావడం అభినందనీయమని అన్నారు.
విక్రమ్-1 ప్రయోగంలో భాగస్వామిగా నిలిచిన రాకేష్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. స్థానిక యువత కూడా సాంకేతిక, అంతరిక్ష రంగాలపై ఆసక్తి పెంచుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. రాకేష్ విజయంతో చీరాల ప్రాంత యువతలో కొత్త స్ఫూర్తి కలుగుతుందని పేర్కొన్నారు.