నేపాల్‌లో భారీ వర్షాలు, వరదలు సృష్టించిన విధ్వంసాన్ని చూసి ప్రముఖ నటి మనీషా కొయిరాలా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. స్వస్థలం నేపాల్ కావడంతో అక్కడి ప్రజల దయనీయ పరిస్థితిని చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. వరదల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం, నిరాశ్రయులు కావడం, మౌలిక వసతులు ధ్వంసం కావడంపై సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు.
నేపాల్‌లోని రసువా, నువాకోట్, ధాదింగ్ వంటి ప్రాంతాలు వరదల తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. ఉప్పొంగిన వరద నీటితో గ్రామాలు, రహదారులు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. ప్రతికూల వాతావరణంతో పాటు రోడ్లు, వంతెనలు ధ్వంసం కావడంతో సహాయక, రెస్క్యూ చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితులను చూసి చలించిపోయిన మనీషా.. తన మాతృభూమి పడుతున్న కష్టాలను చూసి గుండె పగిలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వరద బాధితులకు స్వచ్ఛంద సంస్థలు వెంటనే స్పందించి ఆహారం, వైద్యం వంటి అత్యవసర సాయం అందించాలని మనీషా కొయిరాలా విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో భారత్, చైనాలు నేపాల్‌కు అండగా నిలవాలని కోరారు. తాను కూడా వ్యక్తిగతంగా సహాయక చర్యల్లో భాగస్వామి అవుతున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రకృతి విపత్తు కారణంగా పర్యాటకులు నేపాల్‌కు దూరం కాకూడదని, దేశ ఆర్థిక వ్యవస్థకు పర్యాటకం ఎంతో కీలకమని ఆమె గుర్తుచేశారు.