‘అజ్ఞాతవాసి’ నష్టాలు.. ఇల్లు అమ్మేయాలని అనుకున్నా: త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు

పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అజ్ఞాతవాసి’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ సినిమా కారణంగా తాను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి త్రివిక్రమ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమా వల్ల వచ్చిన నష్టాలను భర్తీ చేసేందుకు నిర్మాత చిన్నబాబుతో కలిసి 48 రోజుల్లోనే ఆర్థిక వ్యవహారాలను పరిష్కరించుకున్నట్లు ఆయన చెప్పినట్లు సమాచారం. అంతేకాదు, నష్టాలను పూడ్చేందుకు తన రెమ్యునరేషన్‌ను కూడా తిరిగి ఇచ్చినట్లు వెల్లడించారు.

అదే సమయంలో జూబ్లీహిల్స్‌లో తాను కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నట్లు త్రివిక్రమ్ తెలిపారు. ఇల్లు పూర్తయిన తర్వాత కుటుంబంతో కలిసి అక్కడికి మారాలని భావించినప్పటికీ.. ‘అజ్ఞాతవాసి’ వల్ల వచ్చిన నష్టాల భారం పెరగడంతో నిర్మాణంలో ఉన్న ఆ ఇంటిని విక్రయించి నష్టాలను పూడ్చుకోవాలని ఒక దశలో ఆలోచించినట్లు గుర్తుచేసుకున్నారు. ఈ విషయాన్ని తన భార్య, పిల్లలతో కూడా చర్చించినట్లు తెలిపారు. అవసరమైతే ఇంటిని అమ్మేసి ప్రస్తుతం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే కొనసాగాల్సి రావచ్చని వారికి చెప్పినట్లు వెల్లడించారు.

అయితే ఈ నిర్ణయంపై తన భార్య, పిల్లలు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని త్రివిక్రమ్ చెప్పినట్లు సమాచారం. ఇల్లు ఉన్నా లేకపోయినా కుటుంబంగా కలిసి ఉండటమే ముఖ్యమని, అదే అపార్ట్‌మెంట్‌లో కొనసాగేందుకు తాము సిద్ధమేనని వారు చెప్పినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. భారీ అంచనాలతో విడుదలైన ‘అజ్ఞాతవాసి’ ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో అప్పట్లో ఈ సినిమా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతున్న త్రివిక్రమ్.. ఆ సమయంలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారాయి.