నేపాల్‌లో భారీ వర్షాలు, వరదలు, ఆకస్మిక వరదల కారణంగా పలు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక బృందాలు నిరంతరం రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ బాలుడిని హెలికాప్టర్ సిబ్బంది సాహసోపేతంగా రక్షించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వరద నీరు చుట్టుముట్టడంతో ఓ ఇంట్లో చిక్కుకుపోయిన బాలుడు.. సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో హెలికాప్టర్ శబ్దం వినిపించడంతో వెంటనే భవనం పైకి చేరుకున్నాడు. హెలికాప్టర్ సిబ్బంది తనను గుర్తించేలా ఒంటిపై ఉన్న టీషర్ట్‌ను విప్పి గాల్లో అటూఇటూ ఊపుతూ వారి దృష్టిని ఆకర్షించాడు. బాలుడి పరిస్థితిని గమనించిన సిబ్బంది వెంటనే అతడి వద్దకు హెలికాప్టర్‌ను తీసుకెళ్లారు.
అనంతరం సహాయక సిబ్బంది బాలుడిని సురక్షితంగా హెలికాప్టర్‌లోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ప్రమాదకర పరిస్థితుల్లో బాలుడు చూపించిన సమయస్ఫూర్తి, ధైర్యం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రెస్క్యూ సిబ్బంది అప్రమత్తంగా స్పందించి బాలుడి ప్రాణాలను కాపాడటంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.