నేపాల్ వరదల్లో 320 మంది భారతీయులు గల్లంతు.. 400 మంది సురక్షితం

నేపాల్‌ను అతలాకుతలం చేస్తున్న భారీ వరదలు, ఆకస్మిక ప్రవాహాలు, కొండచరియల ఘటనల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకృతి విపత్తుల కారణంగా నేపాల్‌లో 320 మంది భారతీయులు గల్లంతైనట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మరోవైపు నేపాల్‌లోని చైనా సరిహద్దు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 400 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వారందరి పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

నేపాల్‌లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. దీంతో భారతీయుల భద్రతపై కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. గల్లంతైన 320 మంది భారతీయుల ఆచూకీ కోసం నేపాల్ ప్రభుత్వంతో కలిసి భారత అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.