తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన గడువును మరో నాలుగు వారాల పాటు పొడిగించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో దాదాపు 73.39 లక్షల మంది, అంటే మొత్తం ఓటర్లలో 21.7 శాతం మంది ‘అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డ్యూప్లికేట్’ (ASDD) జాబితాలో ఉండటం ఆందోళన కలిగిస్తోందని లేఖలో పేర్కొన్నారు. డ్రాఫ్ట్ రోల్‌లో లోపాలు, మ్యాపింగ్ లేకపోవడం కారణంగా లక్షలాది మంది ఓటర్లు తమ అర్హతను మరోసారి నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
ప్రస్తుతం ఆక్షేపణలు, ఫిర్యాదుల సమర్పణకు సెప్టెంబర్ 16 వరకు గడువు ఉండగా.. దాన్ని మరో నాలుగు వారాలు పొడిగించాలని సీఎం కోరారు. ఓటర్లకు నోటీసులు అందిన తర్వాత అవసరమైన ఆధారాలతో సమాధానం ఇచ్చేందుకు కనీసం 3 నుంచి 4 వారాల సమయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నమోదైన ASDD కేసుల్లో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే 58.6 శాతం కేసులు ఉన్నాయని లేఖలో వెల్లడించారు. మొత్తం 92.86 లక్షల మందికి నోటీసులు అందినట్లు పేర్కొన్నారు.
ఓటర్లకు సవరణ ప్రక్రియ సులభంగా ఉండేలా పలు సూచనలను కూడా సీఎం చేశారు. గ్రామసభలు, పురపాలక వార్డుల్లో కనీసం రెండుసార్లు ఓటర్ల జాబితాను బహిరంగంగా చదివి వినిపించాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ బూత్ స్థాయిలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయడంతో పాటు.. మండల స్థాయిలో అందుబాటులో ఉన్న అధికారిక పత్రాలను ధ్రువీకరణకు ఆమోదించాలని సూచించారు. విచారణలను వేగవంతం చేసేందుకు అదనపు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను నియమించి, ఓటర్లకు అనుకూలమైన సమయాల్లో విచారణలు నిర్వహించాలని లేఖలో కోరారు.