ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. డిప్యూటీ మేయర్ పదవులపై కీలక మార్పులు

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ పాలనకు సంబంధించి కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మేయర్లు, చైర్‌పర్సన్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేలా చేసిన ఏపీ మున్సిపల్ లా సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించింది. 2026 మున్సిపల్ చట్ట సవరణలో భాగంగా మేయర్, చైర్‌పర్సన్ ఎన్నికలను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానాన్ని పునరుద్ధరించారు.

సవరించిన చట్టం ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ పదవుల సంఖ్యను రెండింటి నుంచి ఒకటికి తగ్గించారు. అలాగే మున్సిపాలిటీల్లో వైస్ చైర్‌పర్సన్ పదవుల సంఖ్యను కూడా రెండింటి నుంచి ఒకటికి కుదించారు. ఈ మార్పులతో పట్టణ స్థానిక సంస్థల్లో పాలనా వ్యవస్థను మరింత సరళీకృతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

గవర్నర్ ఆమోదం పొందిన సవరణ చట్టాన్ని అధికారిక గెజిట్‌లో ప్రచురించిన అనంతరం కొత్త నిబంధనలకు పూర్తిస్థాయి చట్టబద్ధత లభించనుంది. మరోవైపు ప్రత్యక్ష ఎన్నికల విధానంలో మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్ల పదవీకాలాన్ని ఐదేళ్లుగా నిర్ణయించారు. దీంతో రాబోయే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ సవరణలు కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.