సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వ వైఫల్యాలు బయటపడ్డాయి: హరీష్ రావు

మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడిన ఆయన, గోదావరి–నల్లమల కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపిస్తూ, లోపాలతో కూడిన కేసు వేయడం వల్లే ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొందని విమర్శించారు.

గోదావరి బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని బీఆర్‌ఎస్ మొదటి నుంచే చెబుతోందని హరీష్ రావు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అంతర్గత ఒప్పందం చేసుకున్నారనే అనుమానాలకు తాజా పరిణామాలు బలం చేకూర్చాయని ఆరోపించారు. బనకచర్ల అంశంలో సీఎం వ్యవహారం పూర్తిగా నాటకీయంగా ఉందని విమర్శించారు.

బనకచర్లపై సమావేశానికి వెళ్లనని చెప్పి తర్వాత రహస్యంగా హాజరయ్యారని హరీష్ రావు ఆరోపించారు. అలాగే కమిటీలో ఆదిత్యనాథ్ దాస్‌ను నియమించడాన్ని ప్రశ్నిస్తూ, జల వనరుల అంశంలో ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.