శేఖర్ మాస్టర్‌తో విభేదాలు లేవు.. రూమర్స్‌ను నమ్మొద్దు: జానీ మాస్టర్

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాలపై జానీ మాస్టర్ స్పందించారు. తమిద్దరి మధ్య ఎలాంటి అపార్థాలు, గొడవలు లేవని స్పష్టం చేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. శేఖర్ మాస్టర్ తనకు అన్నలాంటి వారని, ఒకే కుటుంబ సభ్యుల్లా ఎప్పటి నుంచో కలిసి ఉంటున్నామని తెలిపారు.

సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియోలు, కథనాలను నమ్మవద్దని అభిమానులకు జానీ మాస్టర్ విజ్ఞప్తి చేశారు. రూమర్స్ వైరల్ అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ సెట్స్‌లో తమిద్దరితో మాట్లాడారని, అనంతరం ముగ్గురూ కలిసి సరదాగా గడిపి భోజనం కూడా చేసినట్లు వెల్లడించారు.

చిరంజీవి చూపించిన ప్రేమ, మార్గదర్శకత్వం తమకు ఎంతో విలువైనవని జానీ మాస్టర్ పేర్కొన్నారు. ఆధారాలు లేని వార్తలను నమ్మడం, సోషల్ మీడియాలో షేర్ చేయడం మానుకోవాలని కోరుతూ, ప్రేమ, పరస్పర గౌరవంతో అందరూ కలిసి ముందుకు సాగాలని అభిమానులకు పిలుపునిచ్చారు.