ఎల్లోస్టోన్ పార్క్‌లో బైసన్ బీభత్సం.. పర్యాటకుడిని గాల్లోకి ఎగరేసిన భారీ అడవి దున్న

అమెరికాలోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. బ్రిడ్జ్ బే క్యాంప్‌గ్రౌండ్ సమీపంలో తన మనవడితో కలిసి నడుస్తున్న ఓ పర్యాటకుడిపై సుమారు 900 కిలోల బరువున్న మగ బైసన్ ఒక్కసారిగా దాడి చేసింది. తన కొమ్ముతో అతడిని ఢీకొట్టి దాదాపు 8 అడుగుల ఎత్తుకు గాల్లోకి ఎగరేయగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ మైక్ మెక్‌లియోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మొదట బైసన్ క్యాంప్‌గ్రౌండ్‌లో సంచరిస్తూ పిల్లల వైపు దూసుకెళ్లింది. అనంతరం పర్యాటకుడు, అతని మనవడు మొబైల్‌తో వీడియో తీస్తుండగా బైసన్ వారిని వెంటాడింది. మనవడు తప్పించుకోగా, పర్యాటకుడిని బైసన్ కొమ్ముతో పైకి ఎగరేసింది. ఇతర క్యాంపర్లు, మెక్‌లియోడ్ కలిసి పెద్దగా అరుస్తూ బైసన్‌ను తరిమేయడంతో అది అక్కడి నుంచి వెళ్లిపోయింది.

గాయపడిన పర్యాటకుడిని అత్యవసర వైద్య సిబ్బంది ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అధికారులు తెలిపారు. బైసన్‌లకు కనీసం 25 గజాల దూరం, ఎలుగుబంట్లు, తోడేళ్లు వంటి అడవి జంతువులకు 100 గజాల దూరం పాటించాలని అధికారులు మరోసారి పర్యాటకులకు సూచించారు. ప్రస్తుతం బైసన్‌ల సంతానోత్పత్తి కాలం కావడంతో అవి మరింత దూకుడుగా ప్రవర్తించే అవకాశం ఉందని వైల్డ్‌లైఫ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.