వంటగదిలో ఉల్లిపాయ కీలకమైన పదార్థమే అయినప్పటికీ, దానిని కోయడం చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. ఉల్లిపాయను కట్ చేయగానే కళ్లలో మంట, నీళ్లు రావడం సాధారణమే. అయితే ఇది ఎలాంటి అనారోగ్య సమస్య కాదు.. కళ్లను రక్షించేందుకు శరీరం చేసే సహజ రక్షణ చర్య అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఉల్లిపాయను కోసినప్పుడు దాని కణాల నుంచి ‘సిన్-ప్రొపనేథియల్-ఎస్-ఆక్సైడ్’ అనే వాయువు విడుదలవుతుంది. ఈ వాయువు గాల్లోకి వెళ్లి కళ్లలోని తేమతో కలిసినప్పుడు స్వల్ప ఆమ్లంలా మారి కంటిని చికాకు పెడుతుంది. దీంతో ఆ రసాయనాన్ని బయటకు పంపేందుకు కన్నీటి గ్రంథులు ఎక్కువగా పనిచేయడం ప్రారంభిస్తాయి. ఫలితంగా కళ్ల నుంచి నీళ్లు వస్తాయి.
ఈ సమస్యను తగ్గించేందుకు ఉల్లిపాయలను కోయడానికి ముందు కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచడం, పదునైన కత్తిని ఉపయోగించడం, మంచి గాలి ప్రసరణ ఉన్న ప్రదేశంలో కోయడం వంటి పద్ధతులు ఉపయోగపడతాయి. కాబట్టి కళ్లలో నీళ్లు వస్తాయనే కారణంతో ఉల్లిపాయలను ఆహారంలో తగ్గించాల్సిన అవసరం లేదు. ఆరోగ్యానికి ఉపయోగపడే ఈ కూరగాయను సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది.