పోక్సో (POCSO) చట్టం దుర్వినియోగంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. యుక్తవయసులో ఉన్న అబ్బాయి, అమ్మాయి పరస్పర అంగీకారంతో ప్రేమించుకుని ఇంటి నుంచి వెళ్లిపోతే ప్రతి ఘటనను పోక్సో కేసుగా పరిగణించడం సరైన విధానం కాదని స్పష్టం చేసింది. కుటుంబ పరువును కాపాడుకోవాలనే ఉద్దేశంతో కొందరు తల్లిదండ్రులు పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం యుక్తవయసు బాలబాలికల గోప్యత హక్కులకు సంబంధించిన సుమోటో కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. చిన్నారులను లైంగిక దాడులు, దోపిడీ నుంచి రక్షించడానికే పోక్సో చట్టం రూపొందించబడిందని కోర్టు గుర్తుచేసింది.
విచారణ సందర్భంగా, “ఒక అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుని ఇంటి నుంచి వెళ్లిపోతే ప్రభుత్వం దాన్ని ఎలా ఆపగలదు? 15 నుంచి 18 ఏళ్ల వయస్సు ప్రయోగాత్మక దశ. అలాంటి ప్రతి సంబంధాన్ని పోక్సో కేసుగా పరిగణించాలా?” అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై సమతుల్య దృష్టితో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.