ఆసియా అండర్-23లో భారతానికి స్వర్ణం.. తెలంగాణ అథ్లెట్ ప్రవల్లికకు సీఎం రేవంత్ అభినందనలు

చైనాలోని ఒర్డోస్ వేదికగా జరుగుతున్న తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో భారత యువ అథ్లెట్లు సత్తా చాటారు. మహిళల 4×400 మీటర్ల రిలేలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించగా, విజేతల జట్టులో తెలంగాణకు చెందిన ప్రవల్లిక నరిమళ్ల కూడా ఉండడం రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది.

ప్రవల్లిక విజయం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై అసమాన ప్రతిభ కనబరిచి దేశానికి పేరు తీసుకువచ్చిన ఆమె యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు. ప్రవల్లికను తీర్చిదిద్దిన కోచ్‌లను కూడా సీఎం అభినందించారు.

సాధారణ తాపీ మేస్త్రీ కుమార్తె అయిన ప్రవల్లిక నల్గొండ ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలో చదువుతూ, డిండి గురుకుల స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో 23 స్వర్ణాలతో పాటు మొత్తం 35 పతకాలు సాధించిన ఆమె, ఇప్పుడు ఆసియా స్థాయిలో స్వర్ణం గెలిచి భారత క్రీడా చరిత్రలో మరో మైలురాయిని నమోదు చేసింది.