పవన్ కల్యాణ్‌పై షర్మిల తీవ్ర విమర్శలు..!

జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. మొన్న జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు.

 

పవన్, చెగువేరా, గద్దర్ అన్న సిద్ధాంతాలకు నీళ్లు వదిలేశారని.. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నట్టు కనిపిస్తోందని చెప్పారు. జనసేన పార్టీని ఆంధ్ర మత సేన పార్టీగా మార్చారని వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నారని ఎద్దేవా చేశారు. పవన్ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నారని వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు.

 

జనం కోసం పుట్టిన పార్టీ అని చెప్పి ఒక మతానికి అజెండాగా మార్చడం దారుణమని వైఎస్ షర్మిల అన్నారు. సర్వమత సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజించు పాలించు అన్నట్లుగా పవన్ కల్యాణ్ వైఖరి ఉండటం విచారకరమని అన్నారు. పార్టీ పెట్టి 11 ఏళ్లు పోరాడి.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి, మతం రంగు పూసుకుని, ఒకరి ప్రయోజనాలే లక్ష్యం అన్నట్లుగా మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తున్నానని చెప్పుకొచ్చారు.

 

స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలతో పుట్టిన పార్టీ అని చెప్పి, బీజేపీ ఆశయాలను అలవరుచుకోవడం దురదృష్టకరమని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికైనా మేల్కోవాలని.. బీజేపీ మైకం నుంచి బయట పడాలని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *