ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి దశకు చేరుకున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రెండు రోజుల పాటు ఆటల పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఈ నెల 18న (మంగళవారం) నుంచి ఆటలు ప్రారంభం కానున్నాయి.
మొత్తం 12 రకాల గేమ్స్ నిర్వహిస్తున్నారు. మంగళవారం నుంచి రెండురోజులపాటు ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆటల పోటీలు మొదలుకానున్నాయి. ఈ పోటీలకు చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆసక్తి చూపారు. మొత్తం 173 మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. శాసన, మండలి సభ్యులు రెండు, మూడు రకాల ఆటలు ఆడతామని పేర్లు ఇచ్చారు.
క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్, క్యారమ్స్, కబడ్డీ, త్రోబాల్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, అథ్లెటిక్స్ (పరుగు పందెం, షాట్‌పుట్) అందులో ఉండనున్నాయి.