మూసీ చుట్టూ మాటల మంటలు రగిలాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపణలు, ప్రత్యారోపణలతో వార్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. నిర్వాసితులను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ అంటోంది. బడాబాబుల కట్టడాలను కాపాడేందుకే అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందనే అనుమానం వ్యక్తం చేస్తోంది. అయితే, మూసీ మాటున స్కామ్‌కు తెర తీశారని, పేదలను బలి చేస్తున్నారని విమర్శల దాడి చేస్తోంది బీఆర్ఎస్. ఇదే క్రమంలో ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ, దేశంలో అతి పెద్ద కుంభకోణం జరుగబోతోందని జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల్లో జాతీయ బ్యాంకుగా మూసీ రీ డెవలప్మెంట్ కుంభకోణం డబ్బులు కాంగ్రెస్ పార్టీ వాడుకోవాలని చూస్తోందన్నారు.
హైకోర్టు తీర్పు గుణపాఠం
మూసీనీ ప్రక్షాళన చేయాల్సిందేనన్న కేటీఆర్, తమ హయాంలో ఎస్‌టీపీలను నిర్మించామని, వాటిని పూర్తి చేసి మూసీలోకీ మంచి నీళ్లను వదలాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే సాగర హారం లాంటి పరిస్థితులు రావొచ్చన్నారు. వారం పదిరోజులుగా హైదరాబాద్‌తో పాటు వివిధ పట్టణాల్లో ప్రభుత్వం దుందుడుకు వైఖరి వల్ల ప్రజలు నిద్రాహారాలు మాని భయాందోళన చెందుతున్నారని చెప్పారు. హైడ్రాపై హైకోర్టు తీర్పుకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్, ఎవరి కోసం మూసీ రీ డెవలప్మెంట్ అంటూ నిలదీశారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, మూడు వందల రోజులు దాటినా అమలు కాలేదని విమర్శించారు.
ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
ఒక్క గ్యారెంటీని కూడా ఇంతవరకు అమలు చెయ్యలేదని, ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదన్నారు కేటీఆర్. మూసీ బాధితులకు కాంగ్రెస్ నేతలు కాలకేయులుగా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే లే అవుట్స్‌కు పర్మిషన్ ఇచ్చారని, ఇప్పుడు ఎందుకు కూల్చుతున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి లక్కీ డ్రాలో ముఖ్యమంత్రి అయ్యారని, సునీల్ కనుగోలు డైరెక్షన్‌లోనే ఇండ్లు కూల్చుతున్నారని మండిపడ్డారు. ఆనాడు పర్మిషన్లు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలకు పైసలు లేవని చెప్తున్న ప్రభుత్వం, మూసీకీ మాత్రం లక్ష యాభై వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 2,400 కిలోమీటర్ల గంగానదికి 40 వేల కోట్లు ఖర్చు అయితే, 55 కిలో మీటర్లు ఉన్న మూసీ నదికీ లక్ష యాభై వేల కోట్లు ఖర్చు చేస్తామనడంతోనే స్కామ్ అంతా అర్థం అవుతోందని చెప్పారు.
రూ. లక్ష కోట్ల స్కామ్‌కు తెర
మూసీ రీ డెవలప్మెంట్‌లో రూ. లక్ష కోట్ల స్కామ్ జరగబోతోందన్నారు కేటీఆర్. థేమ్స్ నదికి అయిన ఖర్చు 40 వేల కోట్లు మాత్రమేనని వివరించారు. ఏపీలో చంద్రబాబు నాయుడు రాగానే పింఛన్లు పెంచారని, మరి, రేవంత్ రెడ్డి ఎందుకు పెంచలేదని అడిగారు. చిట్‌చాట్‌లు చేసే రేవంత్ రెడ్డి మీడియా ముందుకు రావడానికి మొహం చాటేస్తున్నారని, మూసీ రీ డెవలప్మెంట్‌పై మంత్రులు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. హైడ్రా బుల్డోజర్లకు అడ్డంగా బీఆర్ఎస్ ఉంటుందన్న కేటీఆర్, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఇల్లు, మాదాపూర్‌లో తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చాలని డిమాండ్ చేశారు.