హైడ్రా కూల్చివేతల పేరుతో సంపన్నుల నుండి వసూళ్లు–: బండి సంజయ్

హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేశారు . హైడ్రా పేరుతో సంపన్నులను బెదిరించి వసూళ్ళకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. అవినీతి, కుటుంబ రాజకీయాలు, వారసత్వం విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందూ దొందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.

 

కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతిపై బండి సంజయ్ ఆరోపణలు

ఈరోజు కరీంనగర్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ హైడ్రా దాడులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అవినీతి పై నిప్పులు చెరిగారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడితే, మూసీ సుందరీకరణ పేరుతో రూ.లక్షన్నర కోట్ల అప్పు తెచ్చి అవినీతికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరదీస్తోందన్నారు.

 

హైడ్రా కూల్చివేతల పేరుతో సంపన్నుల నుండి వసూళ్లు

అయ్యప్ప సొసైటీ అక్రమాల కూల్చివేత పేరుతో హడావుడి చేసిన బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడితే…. ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు హైడ్రా కూల్చివేతల పేరుతో బడా బాబుల నుండి వసూళ్లు చేసే తంతుకు తెరదీశారని బండి సంజయ్ ఆరోపించారు. హైడ్రాపైన బీజేపీ సింగిల్ గానే పోరాటం చేస్తుందని బండి సంజయ్ తేల్చిచెప్పారు.

 

హైడ్రా కూల్చివేతలను అడ్డుకుంటాం

హైడ్రా పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల ఇండ్లను కూల్చివేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఈ విషయంలో బీజేపీ ప్రజలకు ఆయుధంగా మారబోతోందని, తమ ప్రాణాలను అడ్డు పెట్టి అయినా ప్రజల ఆస్తులను కాపాడతామని బండి సంజయ్ స్పష్టం చేశారు . తమ ప్రాణాలను తీసిన తరువాత పేదల ఇండ్లపైకి హైడ్రా దాడులు చేసుకోవాలన్నారు. హైడ్రా తీరును దేశవ్యాప్తంగా ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు.

 

మూసీ ప్రక్షాళన పేరుతో దోపిడీ

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతితో కంపు కొడుతున్నాయి. జీతాలకే పైసల్లేక అల్లాడుతుంటే మూసీ ప్రక్షాళన పేరుతో అప్పు తెచ్చి దోచుకునేందుకు సిద్ధమయ్యారని బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు చిప్ప చేతికిచ్చి బిచ్చగాళ్లను చేసే పరిస్థితికి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. చెరువులు, కుంటలను అక్రమించి సంపన్నులు నిర్మించిన భవనాలను హైడ్రా కూల్చివేస్తుందని భావించామని, కానీ పేద, మధ్య తరగతి ప్రజల ఇండ్లను కూల్చి వాళ్లకు నిలువ నీడలేకుండా చేస్తోందని మండిపడ్డారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వం కొరివితో తలగొక్కోంటుంది

హైడ్రా తీరు చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొరివితో తలగొక్కోంటుందన్నది అర్ధం అవుతుందన్నారు. ప్రభుత్వమే అన్ని అనుమతులిచ్చిన తరువాతే బ్యాంకు లోన్లు తీసుకుని ప్రజలు ఇండ్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఇండ్లను కూల్చి నిలువ నీడలేకుండా చేస్తే ప్రజలు ఏమైపోవాలి? ఎట్లా బతకాలి? ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే అని ప్రశ్నించారు బండి సంజయ్ . వారం రోజుల్లో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో యాక్షన్ ప్లాన్ ను ప్రకటించి అమలు చేయబోతున్నామని బండి సంజయ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *