టీడీపీ వర్సెస్ వైసీపీ..!

ఏపీలో వైఎస్ అభిషేక్ రెడ్డి అనారోగ్యంపై టీడీపీ చేసిన ఓ ట్వీట్ పై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం రాజుకుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య గురించి విషయాలు తెలిసిన వారంతా ఒక్కొక్కరు అనుమానాస్పదంగా మరణిస్తున్నారని టీడీపీ ఓ ట్వీట్ చేసింది. గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించిన ఒక్కక్కరూ అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారని ఆరోపించింది. అంతుపట్టని అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొంది. గొడ్డలి పోటు రహస్యాలు తెలిసిన ఒక్కొక్కరి కథ విషాదాంతంగా ముగుస్తున్నదని ఆరోపించింది. నాడు జగన్ మామ గంగిరెడ్డి.. నేడు అభిషేక్ రెడ్డి.. అంతేనా? అంటూ ట్వీట్ చేసింది.

 

టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు ఇదే కోణంలో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్ జైలుకెళ్లి మరీ నందిగం సురేశ్‌ను పరామర్శించాడని, అదే.. ఆయనకు తమ్ముడి వరుస అయ్యే, ఆయన కోసం పని చేసిన, ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెంట నిలబడ్డ డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి చావు బతుకుల్లో ఉన్నా.. ఎందుకు జగన్ పరామర్శించలేదని అడిగారు. హైదరాబాద్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌లో ఐదు రోజులుగా అభిషేక్ రెడ్డి కోమాలో ఉన్నమాట నిజం కాదా? అని ప్రశ్నించారు. జగన్ కుటుంబ సభ్యులంతా అభిషేక్ రెడ్డి కోసం హైదరాబాద్ వెళ్లారని వివరించారు. అదే వైఎస్ జగన్ లేదా.. ఆయన భార్య భారతి పరామర్శించారా? అంటూ ప్రశ్నించారు.

 

కాగా, ఈ ఆరోపణలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర హ్యాండిల్ ఖండించింది. బుద్ధిలేనితనంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీకి బ్రాండ్ అంబాసిడర్‌గా టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ మారిందని రివర్స్ ఫైర్ అయింది. ఇవి ఏ కుటుంబంలో జరిగాయో చెప్పగలవా? అంటూ కౌంటర్‌గా ఆరోపణలు చేసింది. మామకు వెన్నుపోటు పొడిచి ఆయన మానసిక క్షోభతో మరణించేలా చేశారని పేర్కొంది. బావ మరిదికి మెంటల్ సర్టిఫికేట్ ఇప్పించి.. హత్యాయత్నం నుంచి కేసు తప్పించారని ఆరోపించింది. తమ్ముడిని గొలుసులతో కట్టేశారని, ఇప్పటికీ బయటకు రానీయకుండా చేస్తున్నారని పేర్కొంది. ఆ కుటుంబంలోనే ఒక మహిళ ఉరివేసుకుని బలవన్మరనానికి పాల్పడితే ఆ స్టోరీని సైలెంట్‌గా ఖతం చేసేశారని ఆరోపించింది.

 

ఇక అభిషేక్ రెడ్డి అనారోగ్యం గురించి వైసీపీ స్పందిస్తూ.. అభిషేక్ రెడ్డి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైఎస్ జగన్ ఆరా తీస్తున్నారని వివరించింది. అభిషేక్ రెడ్డి మెల్లిగా కోలుకుంటున్నారని తెలిపింది. టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నదని విమర్శలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *