టీడీపీ ఆఫీసు దాడి కేసు, వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో స్మాల్ రిలీఫ్..

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు చిన్న ఊరట లభించింది. దేవినేని అవినాశ్, జోగి రమేశ్‌లకు మధ్యంతర రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు, 48 గంటల్లో పాస్‌పోర్టు అప్పగించాలని ఆదేశించింది.

 

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు ఐదుగురు వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చిన నుంచి ఆయా నేతలు అందుబాటులో లేరు. నేతల పిటిషన్లను విజయవాడ న్యాయస్థానం, హైకోర్టు రిజెక్ట్ చేసింది. నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాకపోతే అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర రక్షణ కల్పిస్తూనే పలు షరతులు విధించింది.

 

ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను విచారించే పనిలోపడ్డారు. ఈ క్రమంలో దేవినేని అవినాశ్, జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, గవాస్కర్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు దృష్టి సారించారు. ఇందులోభాగంగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. వైసీపీ నేతల తరపున కపిల్ సిబల్, అల్లంకి రమేష్.. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి, సిద్ధార్థ్‌ లుత్రా న్యాయస్థానం ముందు తమ వాదనలు వినిపించారు.

 

ఇరువర్గాల వాదనలు విన్న ఇద్దరు సభ్యుల ధర్మాసనం.. పాస్‌పోర్టు అప్పగించాలని ఆదేశించింది. అంతేకాదు కేసు దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించాలని స్పష్టం చేసింది. మూడువారాల వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. అధికారులు పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ నాలుగుకు వాయిదా వేసింది. ముందస్తు బెయిల్‌పై అదే రోజు తేల్చనుంది న్యాయస్థానం.

 

2021 అక్టోబరు 19న దాదాపు 200 మంది టీడీపీ ఆఫీసుపై దాడి చేశారు. ఆ ఘటనలో ఆఫీసుకి సంబంధించిన ఫర్మీచర్ డ్యామేజ్ అయ్యింది. వారిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నం చేసినప్పటి కీ ఫలితం లేకపోయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ఆ కేసుపై దృష్టి పెట్టింది కూటమి సర్కార్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *