పూజల పేరుతో డబ్బులు రెట్టింపు చేస్తామంటూ మోసం.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

కష్టపడకుండా డబ్బులు రెట్టింపు చేసుకోవాలనే ఆశను ఆసరాగా చేసుకుని అమాయకులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీసులు రట్టు చేశారు. పూజలు, మంత్రాలతో అదృష్టం మారుతుందని నమ్మించి, చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నకిలీ నోట్లను అసలైన కరెన్సీగా చూపిస్తూ లక్షల రూపాయలు దోచుకుంటున్నట్లు గుర్తించారు. ఇప్పటికే 40 మందికి పైగా బాధితులు ఈ ముఠా చేతిలో మోసపోయినట్లు సమాచారం.

ఈ వ్యవహారంలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు ప్రధాన నిందితులు ఇప్పటికే వేరే కేసులో పోలీసుల అదుపులో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవలే పూజల పేరుతో డబ్బులు రెట్టింపు చేస్తామని మోసాలకు పాల్పడుతున్న మరో అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వరుసగా వెలుగుచూస్తున్న ఈ ఘటనలు ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్నాయి.

పూజలు, మంత్రాలు, డబ్బులు రెట్టింపు చేస్తామనే మాటలు నమ్మి నగదు అప్పగించి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిల్డ్రన్ బ్యాంక్ నోట్లను అసలైన కరెన్సీగా నమ్మించే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.