ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరో బాల్ ట్యాంపరింగ్ వివాదం.. బంతిపై మింట్స్ రుద్దాలని చర్చ!

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును మరోసారి బాల్ ట్యాంపరింగ్ వివాదం చుట్టుముట్టింది. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో వెలుగుచూసిన శాండ్‌పేపర్‌గేట్ ఘటనకు సంబంధించి తాజాగా కొత్త ఆరోపణలు బయటకు వచ్చాయి. ఆస్ట్రేలియాకు చెందిన సెన్ మీడియా సంస్థ కోసం జర్నలిస్ట్ గెరార్డ్ వాట్లీ నిర్వహించిన పరిశోధనలో.. 2018 అక్టోబర్‌లో పాకిస్థాన్‌తో దుబాయ్‌లో జరిగిన తొలి టెస్టులో బంతి స్వభావాన్ని మార్చేందుకు మింట్స్ ఉపయోగించాలనే ఆలోచన జట్టులో చర్చకు వచ్చినట్లు వెల్లడైంది.

నివేదిక ప్రకారం.. పాకిస్థాన్‌పై బౌలర్లు ఆశించిన స్థాయిలో స్వింగ్ రాబట్టలేకపోవడంతో కొందరు ఆటగాళ్లు బంతిని ట్యాంపరింగ్ చేసే మార్గాలపై చర్చించారట. ఈ క్రమంలో బంతిపై మింట్స్ రుద్దే అంశాన్ని ఓ ఆటగాడు ప్రస్తావించినట్లు సమాచారం. అయితే దీనిపై జట్టులోని మరో సభ్యుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు నివేదిక పేర్కొంది.

ఈ విషయం తెలుసుకున్న అప్పటి ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ఆటగాళ్లను నిలదీసినట్లు కథనం వెల్లడించింది. బంతిని ట్యాంపరింగ్ చేయాలనే ఆలోచనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారట. అప్పటి కెప్టెన్ టిమ్ పైన్ కూడా జోక్యం చేసుకుని అలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకున్నట్లు నివేదిక పేర్కొంది. దక్షిణాఫ్రికాలో శాండ్‌పేపర్ వివాదం జరిగిన ఆరు నెలలకే ఈ కొత్త ఆరోపణలు తెరపైకి రావడం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది.