6.58mm సన్నని డిజైన్‌తో Huawei Mate 90 Air.. 6500mAh బ్యాటరీ, 7 అంగుళాల డిస్‌ప్లే!

హువావే (Huawei) చైనాలో కొత్త స్మార్ట్‌ఫోన్ Mate 90 Airను అధికారికంగా విడుదల చేసింది. సన్నని డిజైన్‌తో ఆకట్టుకుంటున్న ఈ ఫోన్ కేవలం 6.58mm మందం, 208 గ్రాముల బరువుతో వస్తోంది. ఇప్పటివరకు విడుదలైన Mate సిరీస్ బార్ ఫోన్లలో ఇదే అత్యంత సన్నని మోడల్ అని కంపెనీ పేర్కొంది. ఇందులో 7 అంగుళాల 1.5K క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2,160Hz PWM డిమ్మింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వెనుకవైపు Mate 90 సిరీస్‌ను పోలిన సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో Kirin 9020 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో 12GB RAM అందించగా, మెమరీ టెక్నాలజీ సాయంతో కొన్ని బ్యాక్‌గ్రౌండ్ టాస్క్‌లలో 16GB RAM స్థాయి పనితీరును అందిస్తుందని కంపెనీ చెబుతోంది. కేవలం 3.7mm మందం కలిగిన మిడ్ ఫ్రేమ్‌తో ఫోన్‌కు స్లిమ్ లుక్‌ను అందించారు.

బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 6,500mAh భారీ బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 23 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుందని హువావే వెల్లడించింది. అలాగే 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. సన్నని డిజైన్‌తో పాటు భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లేను అందించడం ఈ ఫోన్ ప్రత్యేకతగా నిలుస్తోంది.