దేశంలో డ్రగ్స్ మహమ్మారి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుతో పాటు దేశ అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. డ్రగ్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నవంబర్ 25 నుంచి మూడు రోజుల పాటు ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో డ్రగ్స్ సమస్య ఒకటని పేర్కొన్నారు.
యువత డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని, ఒకప్పుడు ఎంతో అభివృద్ధి చెందిన పంజాబ్ రాష్ట్రం ఈ సమస్యతో తీవ్రంగా ప్రభావితమైందని కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కూడా మాదకద్రవ్యాల సమస్య విస్తరిస్తోందని తెలిపారు. ఇప్పటికైనా అప్రమత్తం కాకపోతే యువత భవిష్యత్తును, దేశ అభివృద్ధిని కాపాడుకోవడం కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు.
డ్రగ్స్ వినియోగం వల్ల వ్యక్తులు విచక్షణ కోల్పోయి కుటుంబాలకు, సమాజానికి భారంగా మారుతున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మాదకద్రవ్యాల విక్రయం ద్వారా వచ్చే డబ్బును దేశ వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాదానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. న్యూక్లియర్ కుటుంబాల పెరుగుదల, యువతలో స్వేచ్ఛా ధోరణి కూడా డ్రగ్స్ వినియోగం పెరగడానికి కారణాలుగా మారుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.