బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడనున్నాయి. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
కోస్తాంధ్ర, యానాంలో నేటి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల పిడుగులతో కూడిన మెరుపులు సంభవించవచ్చని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
రాయలసీమలోనూ రానున్న మూడు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.