తిరుమల పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల, తిరుపతి అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై కీలక ప్రకటనలు చేశారు. భక్తులకు భద్రత, రవాణా, వైద్య సదుపాయాలతో పాటు ఆలయాల నిర్మాణం, అన్నప్రసాదం, పచ్చదనం, సోలార్ విద్యుత్, ఉద్యోగుల గృహ వసతి వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
1996లో ప్రారంభమైన టీటీడీ మ్యూజియాన్ని ఆధునికీకరించినట్లు చంద్రబాబు తెలిపారు. మ్యూజియం నిర్వహణ బాధ్యతలను టాటా గ్రూప్‌కు అప్పగించే నిర్ణయం ఇప్పటికే టీటీడీ పాలకమండలి తీసుకుంది. భక్తులకు తిరుమల ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని మరింత మెరుగ్గా పరిచయం చేసేలా మ్యూజియాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.
మరోవైపు తిరుమలకు వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎల్‌ఐసీ ద్వారా బీమా సదుపాయం కల్పించే నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ వివరాల ప్రకారం ప్రమాదవశాత్తు మరణించిన భక్తులకు బీమా మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచడంతో పాటు, తిరుమలలో సహజ మరణానికి కూడా బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. సాధారణ భక్తులు స్వామివారి నామస్మరణతో ప్రశాంతంగా ధ్యానం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లపై కూడా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.