అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో భారత నౌకాదళ నౌకను పాకిస్థాన్ నేవీ నౌక ఢీకొన్న ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. సెప్టెంబర్ 15 సాయంత్రం జరిగిన ఈ ఘటనపై పాకిస్థాన్ హైకమిషన్ చార్జ్ డి అఫైర్స్ సాద్ అహ్మద్ వారైచ్‌ను భారత విదేశాంగ శాఖ పిలిపించి బలమైన నిరసన తెలిపింది. పాకిస్థాన్ నౌకాదళ యూనిట్ వ్యవహరించిన తీరు ఆమోదయోగ్యం కాదని, వృత్తిపరమైన ప్రమాణాలకు విరుద్ధమని భారత్ పేర్కొంది.
భారత వర్గాల వివరాల ప్రకారం.. సాధారణ నిఘా విధుల్లో ఉన్న భారత నౌకకు పాకిస్థాన్ నౌక వేగంగా చేరువైంది. అనంతరం భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ప్రమాదకరంగా దిశ మార్చుకోవడంతో రెండు నౌకలు ఢీకొన్నట్లు సమాచారం. ఈ ఘటన అంతర్జాతీయ జలాల్లో చోటుచేసుకున్నట్లు భారత విదేశాంగ శాఖ ధృవీకరించింది.
ఈ ఘటనలో ఎలాంటి భారీ నష్టం జరగలేదని విదేశాంగ శాఖ తెలిపింది. అయితే పాకిస్థాన్ నౌకాదళ నౌక వ్యవహరించిన తీరు 1991లో భారత్-పాక్ మధ్య కుదిరిన సైనిక విన్యాసాలు, కదలికలకు ముందస్తు సమాచారం ఇచ్చే ఒప్పందంలోని ఆర్టికల్ 10కు విరుద్ధంగా ఉందని భారత్ పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులకు తమ ఆందోళనను తెలియజేయాలని పాక్ దౌత్యవేత్తకు సూచించింది.