మక్కాపై డ్రోన్ దాడికి యత్నం.. సౌదీలో హైఅలర్ట్

ఇస్లాం పవిత్ర నగరం మక్కాపై డ్రోన్ దాడికి ప్రయత్నం జరిగిందన్న వార్త సౌదీ అరేబియాలో కలకలం రేపింది. మక్కాకు దక్షిణంగా హౌతీలు ప్రయోగించినట్లు పేర్కొన్న ఓ డ్రోన్‌ను సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. డ్రోన్ మక్కా నిషేధిత గగనతలంలోకి ప్రవేశించకముందే దాన్ని కూల్చివేసినట్లు వెల్లడించారు.

డ్రోన్ ఘటన అనంతరం మక్కాతో పాటు జెడ్డా, తాయిఫ్ ప్రాంతాల్లో కొద్దిసేపు భద్రతా అప్రమత్తతను పెంచారు. పవిత్ర నగరానికి సమీపంలో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించినట్లు సమాచారం. ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెలువడలేదు.

మరోవైపు మక్కాలో చరిత్రలో తొలిసారిగా ‘రెడ్ అలర్ట్’ జారీ చేసినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ అంశంపై అధికారికంగా మరింత స్పష్టత రావాల్సి ఉంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో మక్కా సహా కీలక ప్రాంతాల భద్రతపై సౌదీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.