అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రక్షిత అటవీ భూములపై రీ సర్వే పనులను పక్కా ప్రణాళికతో చేపట్టాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ వై. ఖోమ్ నైడియా దేవి అధికారులను ఆదేశించారు. బుధవారం అమరావతి నుంచి చీఫ్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్, భూ పరిపాలన చీఫ్ కమిషనర్ జి. జయలక్ష్మితో కలిసి వివిధ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సమావేశంలో నిషేధిత భూములు 22-ఏ, రీ సర్వే పనులు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, రక్షిత అటవీ భూముల పురోగతి, పీజీఆర్ఎస్ తదితర అంశాలపై అధికారులు సమీక్షించారు. ఆయా కార్యక్రమాల అమలు, పురోగతిపై జిల్లాల వారీగా వివరాలను తెలుసుకున్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్లోని జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో ఇన్చార్జ్ కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రక్షిత అటవీ భూముల రీ సర్వేను సమన్వయంతో చేపట్టి, నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం పనులను పూర్తి చేయాలని సూచించారు. భూ రికార్డుల డిజిటలైజేషన్, 22-ఏ భూములకు సంబంధించిన అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.