కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం.. సెప్టెంబర్ 18న రిలీజ్

హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం నిర్మాతగానూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ‘తిమ్మరాజుపల్లి టీవీ’తో ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన.. ఇప్పుడు ‘హతః’ అనే డిఫరెంట్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌లో కనిపించిన నల్ల పిల్లి, దానికి పెట్టిన క్యాప్షన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. తాజాగా ‘హతః’ టీజర్‌ను సెప్టెంబర్ 18, 2026న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్‌లో నల్ల పిల్లిని చూపిస్తూ ‘ఈ పిల్లి బతికే ఉందా లేక..’ అనే క్యాప్షన్ పెట్టడం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. సాధారణంగా టైటిల్ పోస్టర్లలో హీరో, హీరోయిన్ లేదా కథకు సంబంధించిన విజువల్స్ కనిపిస్తుంటాయి. అయితే ‘హతః’ టీమ్ అందుకు భిన్నంగా కేవలం పిల్లిని చూపించడంతో సినిమా మిస్టరీ థ్రిల్లర్‌గా ఉండొచ్చనే చర్చ మొదలైంది. ఇప్పటివరకు కథకు సంబంధించిన ఎలాంటి క్లూను కూడా మేకర్స్ రివీల్ చేయలేదు.

‘హతః’ చిత్రానికి అనుష్ గోరక్ కథ, దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. కిరణ్ అబ్బవరం, శివశంకర నాయుడు వై. నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జెసిన్ జార్జ్ సంగీతం అందిస్తుండగా, కుష్లు మద్దాల, రెహ్మాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 18న విడుదల కానున్న టీజర్‌లో అసలు కథకు సంబంధించిన ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి.