హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్: నేడు ఈ ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ నగరంలో సోమవారం (జూన్ 8) పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలులో ఉండనున్నాయి. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్, ముగ్ధ జంక్షన్ పరిసరాల్లో స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ రూట్లలో ప్రయాణించే వాహనదారులు రోడ్ నంబర్ 2, బంజారాహిల్స్ వైపు వెళ్లేందుకు ముందే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో వార్షిక చేప ప్రసాదం పంపిణీ (మృగశిర కార్తె) కార్యక్రమం సందర్భంగా సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకు నాంపల్లి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నందున ఈ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు ప్రకటించారు. ప్రయాణికులు గాంధీ భవన్, గృహకల్ప బస్ స్టాప్‌లను ఉపయోగించుకోవాలని, ఆటోల్లో వచ్చే వారి కోసం షెజాన్ హోటల్ వద్ద ప్రత్యేక డ్రాప్-ఆఫ్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

మరోవైపు మియాపూర్ బస్ స్టాప్ సమీపంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా నూతన ఫ్లైఓవర్ శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ముంబై జాతీయ రహదారి (NH-65) తో పాటు మియాపూర్ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఉంటుందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ఈ మార్గంలో ప్రయాణించే వారు ముందుగానే ప్లాన్ చేసుకుని, ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లడం ద్వారా ట్రాఫిక్ చిక్కుల నుంచి బయటపడవచ్చని అధికారులు సూచించారు.